Thursday, October 13, 2011

వేర్పాటువాదానికి, తెలంగాణావాదానికి తేడా తెలుసుకోనోల్లు మీరేం జర్నలిస్టులు

తెలంగాణావాదం వేర్పాటువాదం అంటూ సీమంధ్ర ఛానళ్ళు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నై. వేర్పాటువాదం అంటే అర్థం తెలుసా మీకు? వేర్పాటువాదానికి, తెలంగాణావాదానికి తేడా తెలవకుండా జర్నలిస్ట్ లుగా ఎట్లా చేస్తున్నార్ర బై ? వేర్పాటు వాదం అంటే దేశం నుంచి విడి పోవడం. ప్రత్యేకవాదం అంటే రాష్ట్రం నుంచి విడిపోవడం.. సీమంధ్ర నేతలకు మైండ్ ఉండది కాబట్టి వాళ్ళు అంటారు. మీకు కూడా మైండ్ దొబ్బిందా? సీమంధ్ర యాంకర్ లందరూ వేర్పాటువాదం అంటున్నారు. ఆఖరికి hmtv యాంకర్లు కూడా అంటున్నారు.. మీదేమి జర్నలిజం.. మీరేం జర్నలిస్టులు.. ఇప్పటికి అయినా తెలుసుకోండి. వేర్పాటు వాదం వేరు.. తెలంగాణావాదం వేరని. ఇంకా వేర్పాటువాదం అంటే మీకన్నా మూర్ఖులెవ్వరు ఉండరు..

Thursday, September 8, 2011

కాళన్న యాదిలో...



తెలంగాణ వేరైతే

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?

రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?

పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?

ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
–కాళోజీ
...............

దోపిడి చేసే ప్రాంతేతరులను...

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం

దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం - ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం

తెలంగాణమిది - తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే - మునుగును తప్పక
-కాళోజి
....................

నిర్వాకం

నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి
పదవి అధికారముల బూని
పదిలముగ తల బోడి జేస్తివి

దాపునకు రానిస్తె చనువుగ
టోపి పెడితివి లాభపడితివి
అన్నవై తమ్ముళ్ల తలలను
నున్న జేస్తివి మురియబడితివి

తొత్తులను చుట్టూర జేర్చుక
పెత్తనాలు చేయబడితివి
‘పొచంపాడు’ పథకము
కూచికూచి చేసేస్తివి

‘దొంగ ముల్కి’ సనదులిచ్చి
దొరతనమ్ము వెలిగిస్తివి
తమ్ములను ఇన్నాళ్లబట్టి
వమ్మజేస్తివి తిన్నగుంటివి

ఎన్నిసార్లు మొత్తుకున్నను
అన్నవయ్యును గమ్మునుంటివి
అన్న అధికారమునకు తగిన
న్యాయబుద్దిని కోలుపోతివి

చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు
చిలుక పలుకలు పలుకుచుంటివి
–కాళోజి
................

పోదాం పదరా!!

పదరా పదరా పోదాం పదరా
తెలంగాణ సాధిద్దాం పదరా
దొంగల దూరం కొడదాం పదరా
వేరే రాజ్యం చేద్దాం పదరా || పదరా ||

షాట్లకు బెదరక చెదరక పదరా
హిరణ్యకశిపుడు హడలగ పదరా
నర్సింహుడవై ముందుకు పదరా
పదరా పదరా … || పదరా ||

అధికృత హింసనే పాలన అంటే
ప్రహ్లాదుని హేళన చేస్తుంటే
ప్రత్యక్షంగా నర్సింహులమై
ప్రతిహింసకు పాల్పడదాం || పదరా ||

హిరణ్యకశివుల పొట్టలు చీల్చి
ఫెగుల మాలలు చేద్దాం పదరా
పదరా పదరా ….

వేర్పడదామని ఇద్దరికుంటే
కాదను వారిని కాలదన్నమా
వేరే రాజ్యం చేయబూనమా
పదరా పదరా …..

–కాళోజి
................

నాగరికుడా ‘విను’...

నా నోటికాడి బుక్కను
నాణ్యంగా కాజేసిన
నాగరికుడా ‘విను’

నా నాగటి చాలులోన
నాజూకుగ పవ్వళించి
నను కాటేసిన
నాగరికుడా విను?

నావారల చేరదీసి
నానా విధ బోధలతో
నాణ్యంగా నన్ను కొరిగి
నలుబదైదు సంతకాల
నాటకమాడిన నటుడా
నాగరికుడా విను!

కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన
భరత మాతాకీ జై
తెలంగాణ జిందాబాద్

-కాళోజి
.............

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.

‘రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు

సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు
తోలడమంటే పశువు

దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవంటేనే దారి.

బొక్కంటే ఎముక కాదు
బొక్కంటె పొక్క తెలివి
మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు

బర్రంటె నవ్వులాట
గేదంటేనే పాలు
పెండంటె కొంప మునుగు
పేడంటేనే ఎరువు

రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు
తక్కినోళ్ల నోళ్ల యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు

వహ్వారే! సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహర్ద్రమ్ము

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
భోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు

భోయీ భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు

కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒకటేమిటి
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక
పాపము అతనికి

ఉర్డంటే మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జౌనపదుని లేఖ లేవో
జౌఇన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపత్రయ పడుచున్నడు

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంధ్రవాది వాడు
భీమశాస్ర్తి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న
-కాళోజి
............

ప్రత్యేక తెలంగాణ అంటే

ప్రత్యేక తెలంగాణ అంటే
పక్కలిరగ తన్నేందుకు
ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?

ప్రజాస్వామ్య రాజ్యాంగం
పరిపాలన గల దేశము
ప్రజా మతము ప్రకటిస్తె
పట్టి కొట్టి చంపేస్తద?

వేలు లక్షలు ప్రజలు
జేలుకేగ సిద్ధపడితే
ఏర్పట్లు చేయలేక
లాఠీచార్జి పరిపాలన?

కాడెద్దుల ధోరణిలో
కూడని పనియే లేదా?
వినిగి వేసారి జనం
హింసకాండ తలబెడితే
కేంద్రానిది బాధ్యతంత

‘ప్రెస్టేజి’ పేర హింస
ప్రభుత్వాన్కి సబబైతె
ప్రాణిధర్మ హింసకాండ
ప్రజలకు కూడా సబబే

బ్రహ్మన్న చంపు చంపు
ఏ పాటి చంవుతావో
తూటాలు ఎన్నున్నయో
పేల్చుకో, ఆబాలం గోపాలం

చంపు చంపు చంపు అనుచు
బరి రొమ్ములతో బజార్లో
తూటాలను ఎదురుతాన్రు
ఒకటో రెండో వుంచుకో
తుదకు ఆత్మహత్యకైన
అక్కరకొస్తె నీకు, లేకుంటే
ప్రాణాలతో ప్రజల చేతికే
చిక్కితే నీకున్నది కుక్కచావు

తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తా
భరతమాతాకీ జై
తెలంగాణ జిందబాద్.

–కాళోజి
.................

సాగిపోవుటె బ్రతుకు...

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు

ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.

బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.

-కాళోజి

ఇయ్యాళ కాళన్న 97వ జయంతి.. !


సెప్టెంబర్‌ 9
నాలుగుకోట్ల జనుల గొడవ వినిపించిన
తెలంగాణ ప్రతిధ్వని ..!
వలసపెత్తనంపై సమరం సాగించిన
అక్షర సేనాని.. !
సామాన్యుడి గొంతుకై నిలిచిన ప్రజా కవి..!
సకల అధిపత్యాలను చీల్చిచెండాడిన ధీశాలి..!
సాహిత్య ప్రపంచాన తెలంగాణ వెలుగురేఖ..!
ఆ మహనీయుడు ..మన కాళోజీ.. !
ఇయ్యాళ కాళన్న 97వ జయంతి.. !

Saturday, August 13, 2011

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌.. తెలంగాణ టైగర్‌-ఆగస్టు 17న పాపన్న జయంతి సందర్భంగా:






[Papanna1.jpg]
(తెలంగాణ శ్రీనివాస్‌)
ఆగస్టు 17న పాపన్న జయంతి సందర్భంగా:

1700 సంవత్సరంలోనే తెలంగాణలో బడుగు బలహీనవర్గాలు రాజరికపు రాక్షసత్వంపై పిడికిలెత్తినయి. స్వేచ్ఛా స్వతంత్రం కోసం తల్వార్‌ పట్టినయి. ఈ బడుగుబలహీన వర్గాలకు నాయకత్వం వహించింది సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌.. తెలంగాణ టైగర్‌.. బెబ్బులిలా శతృ సైన్యాన్ని చీల్చి చెండాడిన ధీరుడు. మొఘలుల గుండెల్లో గుబులు బుట్టించిన యోధుడు. బహదూర్‌షాను బొందలో కలిపిన వీరుడు. బడుగుబలహీనవర్గాలు తలెత్తుకు తిరిగేవిధంగా రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న రణం చేసిండు. గోల్కొండ ఖిల్లాను ఏలిండు. శివాజీ సమకాలీకుడు. శివాజీతో పాటు కీర్తించదగ్గ మేథావి. కానీ పాపన్న బీసీ అయినందున చరిత్రపుట్టల్లోకెక్కలేదు ఇంతటి మహావీరుడు అగ్రకుల రచయితల కలంపోటుతో కనుమరుగైండు.

అతను పుట్టింది వెనకబడిన కులంలో… వృత్తి కల్లు గీత.. గొలకోసే కత్తిని ఒక చేత.. రాజులపై తల్వార్ను మరో చేత పట్టి శతృవులను చీల్చిచెండాడిండు.. మొగలాయి సామ్రాజ్యాధి నేతలను వణికించి రాజ్యాధికారం చేపట్టిండు.

సర్వాయి పాపన్న పుట్టింది వరంగల్‌ జిల్లా ఖిలాషాపూర్ లో.. పాపన్న సాహసాలకు, సాధించిన విజయాలకు మౌన సాక్షిగా చెరగని సంతకం చేసింది భువనగిరి దుర్గం. పాపన్న చరిత్ర ముందు తరాలకు ఆదర్శం... తాను పుట్టిన కులాన్ని, తన తోటి వారికి తక్కువ వారిగా చిత్రీకరించడం పాపన్నకు నచ్చలేదు. సమానత్వం కోసం, కులగౌరవం కోసం పోరాడిండు. కులవృత్తిని తక్కువ చూపు చూస్తున్న వారికి కనువిప్పు కలిగించిండు. రాజ్యాధికారం సాధించిగానీ తిరిగిరానని తల్లి సర్వమ్మకు ఒట్టేసి చెప్పిండు.


మొగలాయి ప్రభువుల అరాచకాలతో అట్టుడుకుతున్న రోజులవి. ప్రభువులకు ఎదురు తిరగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ అరాచకాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న శక్తి అవతారమెత్తిండు. గౌడవృత్తిదారులందరినీ.. బడుగు బలహీన వర్గాల వారిని ఒక్కటి చేసిండు. తాటికొండ కొండ పై దుర్గాన్ని నిర్మించిండు. ప్రజల్లో చైతన్యం నింపి యువతను కూడ గట్టిండు. చిన్న చిన్నప్రాంతాలను ఆక్రమిస్తూ రాజ్యాధికారం దిశగా అడుగులేసిండు. పాపన్న సాహసానికి ప్రజలంతా ఫిదా అయిన్రు. పాపన్న పోరాటానికి బాసటగా నిలిచిన్రు.


సర్వాయి పాపన్న కుల వృత్తులను ప్రోత్సహించిండు. స్వయం సమృద్ది సాధన దిశగా సంస్కరణలు చేపట్టిండు. అంతరించి పోతున్న గౌడ వృత్తిని పునరుద్దరించేందుకు నడుంబిగించిండు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు వనాలను నాటించిండు. కల్లు పై సుంకాన్ని తగ్గించి కల్లుగీతను ప్రోత్సహించిండు. సర్వాయి పాపన్న యోధాను యోధుడే కాదు. చెప్పుకోదగ్గ మేథావి కూడా. దూర ప్రాంత గ్రామాల్లో తీసిన కల్లు రాజధానికి చేరేసరికి చెడిపోకుండా ఉండే ఉపాయం చేసిండు. రాత్రివేళ తీసిన కల్లు చల్లని వాతావరణంలో తక్కువగా పులుసిపోతది. అందుకే రాత్రికి రాత్రే కల్లును రాజధానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయించిండు. తెలతెల్లవారే సరికి స్వచ్ఛమైన కల్లు కళ్లముందు దర్శనమయ్యేది. ఈ ప్రయత్నంతో గౌడ కులస్థులతో పాటు ఇతర చేతి వృత్తుల వారుకూడా పాపన్నకు బాసటగా నిలిచిన్రు. బడుగు వర్గాల ఆర్ధిక స్వాలంబనే పాపన్న బలమని తెలుసుకున్నరు. అందుకే బలహీన వర్గాల ఆదాయవనరుల పై వేటు వేసే కుట్ర పన్నిన్రు. 1702లో రుస్తుదిఖాన్ అనే డిప్యూటీ గవర్నర్ కల్లు గీతవారిని సమూలంగా అణచివేయమని తీర్మానం జారీచేసిండు. ఈ తీర్మానంతో ప్రజల్లోమరింత వ్యతిరేకత వచ్చింది. పాపన్నకు మరింత సైన్యం తోడయింది. రుస్తుంఖాన్ పాపన్నను అణిచివేసేందుకు సమర్ధవంతమైన సైన్యాన్ని నియమించిండు. 1706లో పాపన్నపై దాడి చేసేందుకు రుస్తుంఖాన్ సైన్యం విఫలయత్నం చేసింది. ఔరగంజేబు మరణానంతరం .. 1707లో బహదూర్‌ షా సింహాసనాన్ని అధిష్టించి తానే సామ్రాజాధిపతినని ప్రకటించుకొన్నడు. 1708 మార్చి 31న వేలాది మంది సైన్యంతో పాపన్న ఓరుగల్లు కోటను ఆక్రమించిండు. మచిలీపట్నం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న డచ్, ఇంగ్లీష్ వ్యాపారులనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసిండు. వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత పాపన్న వరంగల్లుకు సుమారు 30 మైళ్లదూరంలో హైదరాబాద్-వరంగల్‌ మెయిన్‌రోడ్‌లో ఉన్న భువనగిరి దుర్గాన్ని ఆక్రమించిండు. సర్వాయి పాపన్న విజయాలు మొఘలు చక్రవర్తల వెన్నులో వణుకుపుట్టించినయి. పాపన్న గురించి డచ్ రిపోర్టర్ తెల్పిన నివేదిక ప్రకారం సర్వాయి పాపన్న ఒక స్వయంపాలకుడని చక్రవర్తి తెలుసుకున్నడు. సామ్రాజ్య అధికారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా కొంత కప్పం చెల్లించి నాయకునిగా కొనసాగవచ్చునని చక్రవర్తి ప్రకటించిండు.. పాపన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నడు. బహదూర్షాకు 14లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు సామ్రాజ్య సైనికుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు సమర్పించిండు. ప్రతిఫలంగా చక్రవర్తి పాపన్నని గోలుకొండకు రాజును చేసిండు.
పాపన్న ఆధిపత్యాన్ని ఓర్వలేని వారు ఇంటీరియల్ కోర్టులో దావా వేశారు. కుల వృత్తిలో ఉండి కల్లుగీయవలసిన వాడికి రాజ్యాధికారమేంటని వాదించిన్రు.. పాపన్నను నియంత్రించమని బహదూర్షా గవర్నర్‌ యూసఫ్ ఖాన్‌ను ఆదేశించిండు.


1709లో పాపన్న మొఘల్ సైన్యాన్ని ఎదురించడానికి సిద్ధమైండు. తాటి కొండలో భయంకరంగా దాడి జరిగినా పాపన్న కొన్ని నెలల పాటు మొఘల్ సైన్యానికి ఎదురొడ్డి నిలిచిండు. మే నెలలో పాప న్న అనుచరులకు గవర్నర్ అత్యధిక మొ త్తం ఆశ చూపాడు. పాపన్న తుపాకి కాల్పులకు గురై బయటపడ్డడు. ఆ పరిస్థి తిలో వేషం మార్చిండు. చివరకు హుస్నాబాద్ గ్రామంలో ఒక కల్లు మండువ దగ్గర ప్రత్యక్షమయిండు. ఆ గ్రామంలోనే తన కులంవారు అధికంగా ఉన్నారు. అందు వల్ల అదే తనకి సరైన రక్షణ ప్రాంతమని భావించిండు. కల్లు దుకాణంలో కూర్చుండగా నిజాం సైన్యం అతడిని బంధించి గవర్నర్ ముందు నిలబెట్టింది. తరువాత సర్దార్ తల నరికివేసి, తలను బహదూర్షా దర్బారుకు పంపారు. మొండాన్ని హైదరాబాద్ కోటగుమ్మానికి వేలాడదీసిన్రు. స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసినంత గుర్తింపు రాలేదు. అదే పాపన్న సమకాలికుడైన శివాజీని మరాఠా ప్రజానీకం, ప్రభుత్వాలు ఆరాధ్య దైవంగా భావించి తగిన గుర్తింపు నిచ్చినయి. పాపన్న బహుజన బీసీ కులానికి సంబంధించిన వాడు కావడం, తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరుడు కావడం వల్లే చరిత్రలో చోటు దొరకలేదు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ యోధాను యోధుల, సాహసవీరుల చరిత్రలు పాఠ్యపుటల్లో రావాలి. సర్వాయి పాపన్న, కొమరం భీం.. దొడ్డి కొమురయ్య..రాణి రుద్రమ.. చాకలి అయిలమ్మ.. వీరోచిత పోరాటాలు పల్లెపల్లెనా పల్లవించాలంటే మన తెలంగాణ మనకు కావాలి. ఆత్మవిశ్వాసం నింపే చరిత్రలు తెలంగాణబిడ్డల మదిలో నిండాలి.

పాపన్న స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ముందు రాష్ట్ర సాధన దిశగా తెలంగాణ వచ్చినంక రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పోరుతెలంగాణ కోరుకుంటుంది.

Tuesday, April 12, 2011

తగలబడే చోట తలదాచుకోమని ఎవ్వడు చెప్పిండు

రోమ్‌లాంటి నగరం తగలబడడానికే తప్ప..
తలదాచుకోవడానికి కాదని రాసిండు ఆంధ్రకవి ఎండ్లూరి సుధాకర్‌
తగలబడే చోట తలదాచుకోమని ఎవ్వడు చెప్పిండు
రోమ్‌కు పోయి కామ్‌గా బతుకాలె కానీ..
రోమ్‌లో బ్రహ్మనాయుడు విగ్రహం పెడ్తమంటే వాళ్లు ఊకుంటరా
తెలంగాణ జాగలకొచ్చి విగ్రహం పెట్టి..
తెలంగాణోన్నే కులహీనుడన్నావంటే నీకు ఈ గడ్డ ఎంత స్వేచ్ఛనిచ్చిందో అర్థం చేసుకో
శ్రీశ్రీకి సలాం కొడ్తం కానీ..
కాళోజీని కాలగర్భంలోకి నెడ్తమంటే ఊరుకోం
తెలుగు హిస్టరీ, మిస్టరీ, జ్యాతి, ఖ్యాతి జాన్తానై
జమానా లెక్క మోసం చేసి జబర్దస్తీ చేస్తే కుదరదు భాయి
ఇది తిరగబడ్డ తెలంగాణ.. బస్తీ మే సవాల్‌ అంటది
బద్మాషులను బజారుకీడుస్తది
మాట భద్రం.. కవిత భద్రం.. బ్లాగ్‌ భద్రం..
-తెలంగాణ శ్రీనివాస్‌

జాతి జాతి అని జాంగలు చింపుకుంటరేందిరా భాయ్‌

జాతి జాతి అని జాంగలు చింపుకుంటరేందిరా భాయ్‌
ఎవ్వని జాతి.. ఎక్కడి జాతి
ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలు ప్రతిష్టించినప్పుడు మీకు జాతి గుర్తుకు రాలేదా
బ్రహ్మనాయుడుకు మా బతుకుకు సంబంధం ఏంది.
నన్నయ్య గురించి తెలిసిన తెలుగుజాతికి..
భాస్కర రామాయణం రాసిన హుళక్కి భాస్కరుడు ఎందుకు గుర్తురాలేదు
అరే భాయి అల్లూరి విగ్రహాన్ని పెట్టేటప్పుడు..
మా కొమరం భీం ఎందుకు కొరగాలేదు
రాయలవిగ్రహాన్ని పెట్టించినోళ్ల కండ్లకు..
మా సర్వాయిపాపన్న ఎందుకు కనబడలేదు
-బైరగోని శ్రీనివాస్‌