Saturday, August 13, 2011

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌.. తెలంగాణ టైగర్‌-ఆగస్టు 17న పాపన్న జయంతి సందర్భంగా:






[Papanna1.jpg]
(తెలంగాణ శ్రీనివాస్‌)
ఆగస్టు 17న పాపన్న జయంతి సందర్భంగా:

1700 సంవత్సరంలోనే తెలంగాణలో బడుగు బలహీనవర్గాలు రాజరికపు రాక్షసత్వంపై పిడికిలెత్తినయి. స్వేచ్ఛా స్వతంత్రం కోసం తల్వార్‌ పట్టినయి. ఈ బడుగుబలహీన వర్గాలకు నాయకత్వం వహించింది సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌.. తెలంగాణ టైగర్‌.. బెబ్బులిలా శతృ సైన్యాన్ని చీల్చి చెండాడిన ధీరుడు. మొఘలుల గుండెల్లో గుబులు బుట్టించిన యోధుడు. బహదూర్‌షాను బొందలో కలిపిన వీరుడు. బడుగుబలహీనవర్గాలు తలెత్తుకు తిరిగేవిధంగా రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న రణం చేసిండు. గోల్కొండ ఖిల్లాను ఏలిండు. శివాజీ సమకాలీకుడు. శివాజీతో పాటు కీర్తించదగ్గ మేథావి. కానీ పాపన్న బీసీ అయినందున చరిత్రపుట్టల్లోకెక్కలేదు ఇంతటి మహావీరుడు అగ్రకుల రచయితల కలంపోటుతో కనుమరుగైండు.

అతను పుట్టింది వెనకబడిన కులంలో… వృత్తి కల్లు గీత.. గొలకోసే కత్తిని ఒక చేత.. రాజులపై తల్వార్ను మరో చేత పట్టి శతృవులను చీల్చిచెండాడిండు.. మొగలాయి సామ్రాజ్యాధి నేతలను వణికించి రాజ్యాధికారం చేపట్టిండు.

సర్వాయి పాపన్న పుట్టింది వరంగల్‌ జిల్లా ఖిలాషాపూర్ లో.. పాపన్న సాహసాలకు, సాధించిన విజయాలకు మౌన సాక్షిగా చెరగని సంతకం చేసింది భువనగిరి దుర్గం. పాపన్న చరిత్ర ముందు తరాలకు ఆదర్శం... తాను పుట్టిన కులాన్ని, తన తోటి వారికి తక్కువ వారిగా చిత్రీకరించడం పాపన్నకు నచ్చలేదు. సమానత్వం కోసం, కులగౌరవం కోసం పోరాడిండు. కులవృత్తిని తక్కువ చూపు చూస్తున్న వారికి కనువిప్పు కలిగించిండు. రాజ్యాధికారం సాధించిగానీ తిరిగిరానని తల్లి సర్వమ్మకు ఒట్టేసి చెప్పిండు.


మొగలాయి ప్రభువుల అరాచకాలతో అట్టుడుకుతున్న రోజులవి. ప్రభువులకు ఎదురు తిరగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ అరాచకాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న శక్తి అవతారమెత్తిండు. గౌడవృత్తిదారులందరినీ.. బడుగు బలహీన వర్గాల వారిని ఒక్కటి చేసిండు. తాటికొండ కొండ పై దుర్గాన్ని నిర్మించిండు. ప్రజల్లో చైతన్యం నింపి యువతను కూడ గట్టిండు. చిన్న చిన్నప్రాంతాలను ఆక్రమిస్తూ రాజ్యాధికారం దిశగా అడుగులేసిండు. పాపన్న సాహసానికి ప్రజలంతా ఫిదా అయిన్రు. పాపన్న పోరాటానికి బాసటగా నిలిచిన్రు.


సర్వాయి పాపన్న కుల వృత్తులను ప్రోత్సహించిండు. స్వయం సమృద్ది సాధన దిశగా సంస్కరణలు చేపట్టిండు. అంతరించి పోతున్న గౌడ వృత్తిని పునరుద్దరించేందుకు నడుంబిగించిండు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు వనాలను నాటించిండు. కల్లు పై సుంకాన్ని తగ్గించి కల్లుగీతను ప్రోత్సహించిండు. సర్వాయి పాపన్న యోధాను యోధుడే కాదు. చెప్పుకోదగ్గ మేథావి కూడా. దూర ప్రాంత గ్రామాల్లో తీసిన కల్లు రాజధానికి చేరేసరికి చెడిపోకుండా ఉండే ఉపాయం చేసిండు. రాత్రివేళ తీసిన కల్లు చల్లని వాతావరణంలో తక్కువగా పులుసిపోతది. అందుకే రాత్రికి రాత్రే కల్లును రాజధానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయించిండు. తెలతెల్లవారే సరికి స్వచ్ఛమైన కల్లు కళ్లముందు దర్శనమయ్యేది. ఈ ప్రయత్నంతో గౌడ కులస్థులతో పాటు ఇతర చేతి వృత్తుల వారుకూడా పాపన్నకు బాసటగా నిలిచిన్రు. బడుగు వర్గాల ఆర్ధిక స్వాలంబనే పాపన్న బలమని తెలుసుకున్నరు. అందుకే బలహీన వర్గాల ఆదాయవనరుల పై వేటు వేసే కుట్ర పన్నిన్రు. 1702లో రుస్తుదిఖాన్ అనే డిప్యూటీ గవర్నర్ కల్లు గీతవారిని సమూలంగా అణచివేయమని తీర్మానం జారీచేసిండు. ఈ తీర్మానంతో ప్రజల్లోమరింత వ్యతిరేకత వచ్చింది. పాపన్నకు మరింత సైన్యం తోడయింది. రుస్తుంఖాన్ పాపన్నను అణిచివేసేందుకు సమర్ధవంతమైన సైన్యాన్ని నియమించిండు. 1706లో పాపన్నపై దాడి చేసేందుకు రుస్తుంఖాన్ సైన్యం విఫలయత్నం చేసింది. ఔరగంజేబు మరణానంతరం .. 1707లో బహదూర్‌ షా సింహాసనాన్ని అధిష్టించి తానే సామ్రాజాధిపతినని ప్రకటించుకొన్నడు. 1708 మార్చి 31న వేలాది మంది సైన్యంతో పాపన్న ఓరుగల్లు కోటను ఆక్రమించిండు. మచిలీపట్నం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న డచ్, ఇంగ్లీష్ వ్యాపారులనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసిండు. వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత పాపన్న వరంగల్లుకు సుమారు 30 మైళ్లదూరంలో హైదరాబాద్-వరంగల్‌ మెయిన్‌రోడ్‌లో ఉన్న భువనగిరి దుర్గాన్ని ఆక్రమించిండు. సర్వాయి పాపన్న విజయాలు మొఘలు చక్రవర్తల వెన్నులో వణుకుపుట్టించినయి. పాపన్న గురించి డచ్ రిపోర్టర్ తెల్పిన నివేదిక ప్రకారం సర్వాయి పాపన్న ఒక స్వయంపాలకుడని చక్రవర్తి తెలుసుకున్నడు. సామ్రాజ్య అధికారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా కొంత కప్పం చెల్లించి నాయకునిగా కొనసాగవచ్చునని చక్రవర్తి ప్రకటించిండు.. పాపన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నడు. బహదూర్షాకు 14లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు సామ్రాజ్య సైనికుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు సమర్పించిండు. ప్రతిఫలంగా చక్రవర్తి పాపన్నని గోలుకొండకు రాజును చేసిండు.
పాపన్న ఆధిపత్యాన్ని ఓర్వలేని వారు ఇంటీరియల్ కోర్టులో దావా వేశారు. కుల వృత్తిలో ఉండి కల్లుగీయవలసిన వాడికి రాజ్యాధికారమేంటని వాదించిన్రు.. పాపన్నను నియంత్రించమని బహదూర్షా గవర్నర్‌ యూసఫ్ ఖాన్‌ను ఆదేశించిండు.


1709లో పాపన్న మొఘల్ సైన్యాన్ని ఎదురించడానికి సిద్ధమైండు. తాటి కొండలో భయంకరంగా దాడి జరిగినా పాపన్న కొన్ని నెలల పాటు మొఘల్ సైన్యానికి ఎదురొడ్డి నిలిచిండు. మే నెలలో పాప న్న అనుచరులకు గవర్నర్ అత్యధిక మొ త్తం ఆశ చూపాడు. పాపన్న తుపాకి కాల్పులకు గురై బయటపడ్డడు. ఆ పరిస్థి తిలో వేషం మార్చిండు. చివరకు హుస్నాబాద్ గ్రామంలో ఒక కల్లు మండువ దగ్గర ప్రత్యక్షమయిండు. ఆ గ్రామంలోనే తన కులంవారు అధికంగా ఉన్నారు. అందు వల్ల అదే తనకి సరైన రక్షణ ప్రాంతమని భావించిండు. కల్లు దుకాణంలో కూర్చుండగా నిజాం సైన్యం అతడిని బంధించి గవర్నర్ ముందు నిలబెట్టింది. తరువాత సర్దార్ తల నరికివేసి, తలను బహదూర్షా దర్బారుకు పంపారు. మొండాన్ని హైదరాబాద్ కోటగుమ్మానికి వేలాడదీసిన్రు. స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసినంత గుర్తింపు రాలేదు. అదే పాపన్న సమకాలికుడైన శివాజీని మరాఠా ప్రజానీకం, ప్రభుత్వాలు ఆరాధ్య దైవంగా భావించి తగిన గుర్తింపు నిచ్చినయి. పాపన్న బహుజన బీసీ కులానికి సంబంధించిన వాడు కావడం, తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరుడు కావడం వల్లే చరిత్రలో చోటు దొరకలేదు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ యోధాను యోధుల, సాహసవీరుల చరిత్రలు పాఠ్యపుటల్లో రావాలి. సర్వాయి పాపన్న, కొమరం భీం.. దొడ్డి కొమురయ్య..రాణి రుద్రమ.. చాకలి అయిలమ్మ.. వీరోచిత పోరాటాలు పల్లెపల్లెనా పల్లవించాలంటే మన తెలంగాణ మనకు కావాలి. ఆత్మవిశ్వాసం నింపే చరిత్రలు తెలంగాణబిడ్డల మదిలో నిండాలి.

పాపన్న స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ముందు రాష్ట్ర సాధన దిశగా తెలంగాణ వచ్చినంక రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పోరుతెలంగాణ కోరుకుంటుంది.