Saturday, November 3, 2012

రాజిరెడ్డి ఆత్మఘోష -(మనసున్నోళ్లు స్పందించండి)

జై తెలంగాణ, జైజై తెలంగాణ. నా ఊపిరినున్నంత వరకూ జై తెలంగాణ నినాదాలు చేసిన. ఏడ గింత తెలంగాణ అలికిడైనా
ఆగమేఘాల మీద ఉరికిన. ఏ పార్టీ, ఏ నాయకుడు తెలంగాణ ఆందోళనలకు పిలుపునిచ్చినా స్వచ్ఛందంగా పాల్గొన్నా తిండితిన్నా తినకున్నా ఉద్యమంలో ముందున్నా. చాలా మంది చెత్తగాళ్ల లెక్క మీడియా కోసమో.. ఫ్యూచర్ లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించో నేను ఉద్యమంలో పాల్గొనలే. టీవీలల్ల కనిపియ్యాలని సభా వేదికలెక్కలే. నేను నిజమైన తెలంగాణవాదిని.  ఉరకలెత్తే ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ బిడ్డని. ఎలగందల్ జిల్లా ధైర్యాన్ని ఎలుగెత్తి చాటిన పోరు కెరటాన్ని. సర్కార్ దాష్టీకానికి, పోలీసుల దౌర్జన్యకాండకు, డేట్ దాటిపోయిన బాష్పవాయుగోళానికి బలైపోయిన తెలంగాణ బిడ్డని.
తెలంగాణ కోసం చావుతో కూడా రాజీపడని రాజిరెడ్డిని. నేను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోలేదు. ఉరేసుకుని ఉసురు తీసుకోలేదు.
మలిదశ ఉద్యమంలో తొలి సమిధను నేను. ఇప్పటివరకు చనిపోయినవారికి భిన్నమైన చావు నాది.
అరేయ్ ఇంకెలా చెప్పాలిరా మీకు. ఈ సీమాంధ్ర లుచ్చాగాళ్లు నన్ను చంపేసిన్రురా. మలిదశ ఉద్యమంలో జరిగిన తొలి సర్కారీ హత్యరా ఇది.
అయినా ఎవరూ స్పందించరేం. దండేసి దండం పెట్టి.. నా శవాన్ని కాలబెట్టి చేతులు దులిపేసుకున్నారేందన్నా. ఇంత దారుణమా అన్నలు.. ఇంత ఘోరమా అక్కలు. హవ్వ ఇంత అన్నాలమా? సర్కార్ చంపితే కూడా కనీసం డీజీపీ ఆఫీస్ ను ముట్టడించాలన్న ఆలోచన రాలేదు మీకు. కనీసం మా జిల్లా బంద్ కు పిలుపునివ్వలేదు. గుజ్జర్ల లెక్క నా శవంతో రాస్తారోకో చేయలేదు. ఒక్క పోలీసోన్ని కూడా గుంజికొట్టలేదు.
ఓ……… ఇప్పుడు ఎన్నికలు లెవ్వు కదా? నా శవం మీద ఓట్లేరుకునే చాన్స్ లేదు కదా? అందుకే ఒక్కపార్టీ కూడా నా చావును సీరియస్ గా తీసుకోలేదు.  ఏందిది? ఇదేం తరీఖా? మీ పార్టొళ్లో.. జేఏసీ నేతలో..  సచ్చిపోతే ఇట్లనే లైట్ తీసుకుంటరా? ఛీ…….. ఇది పద్ధతేనా?  తెలంగాణ ప్రజల ప్రాణాలు పోతుంటే మీరు పంతాలకు పోతున్నరు. మిమ్ముల తప్పు పడ్తలేను బాంచెన్!. జర సోచాయించున్రి. అయినా మీ సంతాపాల కోసమో.. పరామర్శల కోసమో నేను ఉద్యమంలో పాల్గొనలేదు. స్వచ్ఛందంగా తెలంగాణ రావాలనే ఆకాంక్షతో పాల్గొన్న. ఉద్యమంలో సమిధనయినందుకు సంతోషిస్తున్నా.
ఊపిరితిత్తులన్నీ మూసుకుపోయినా నా గుండె చివరి క్షణం వరకు జై తెలంగాణ అని నినదించింది. నన్ను తెలంగాణ తల్లి సగౌరవంగా అక్కున చేర్చుకున్నది.
తెలంగాణ తల్లులు, తండ్రులు, అక్కలు, అన్నలు, తమ్ముళ్లు, చెల్లెల్లు ఇది తెలంగాణ ఉద్యమం. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. తెలంగాణ తల్లికి
విముక్తి కల్గిస్తరని భ్రమపడకండి. మీరే ముందుండి తెలంగాణ సాధించాలి. నా చావుకు బదులు తీర్చుకోవాలి. అట్లని నాకు మాట ఇయ్యండి.
జై తెలంగాణ.. జై జై తెలంగాణ..
ఇట్లు
మీ   రాజిరెడ్డి
సీమాంధ్ర పాలకుల చేతిలో చంపబడ్డ తెలంగాణ బిడ్డను.
తెలంగాణ జాతి కోసం ప్రాణాలర్పించిన రాజిరెడ్డన్నా.. నీ కోరికను మేం నెరవేరుస్తం. సమైక్యవాదులను తరమికొట్టి నీ ఆశయాన్ని నెరవేరుస్తం. నీ కుటుంబానికి తెలంగాణ అండగా ఉంటది. అణువణువునా తెలంగానాన్ని నింపుకున్న రాజన్న కుటుంబం తెలంగాణ సమాజం నుంచి అణా పైసా ఆశించడం లేదు. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. …………………………………………..
(రాజన్నకు పోరుతెలంగాణ శ్రీనివాస్ కన్నీటి నివాళి …)